మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు.
సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలచిన దాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు.
అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు.
క్రీస్తు మనకు రక్షణ యిస్తాడని విశ్వసించిన వాళ్ళలో మనము మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం.
మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ.
నేను ఎల్లప్పుడు మన క్రీస్తు ప్రభువు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మను యివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి, దేవుణ్ణి తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి యింకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు.
మీ మనోనేత్రాలు తెరుచుకోవాలని, మీరు ఆశిస్తున్న వారసత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ వారసత్వం మీకివ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆశీస్సులు ఎంత అద్భుతమైనవో మీరు చూడగలుగుతారు.
దేవుడు క్రీస్తుకు యిచ్చిన స్థానం అన్ని హోదాలకన్నా, అన్ని అధికారాలకన్నా, అన్ని శక్తులకన్నా, అన్ని రాజ్యాలకన్నా గొప్పది. అది ప్రస్తుతమున్న బిరుదులకన్నా, భవిష్యత్తులో లభించే బిరుదులకన్నా గొప్పది.